ప్రలంబఘ్న శ్రీబలదేవుడు

BalaramJayanti020వైశాఖమాసంలో ఒకరోజు దివ్యసోదరులైన బలరామకృష్ణులు మిత్రులతో కలిసి భాండీరవనంలో ఆడుకుంటున్నారు. లేతగడ్డిని తిని, గిరిగోవర్ధనుని పర్వతకోనలలో ఉన్నట్టి నిర్మలజలాన్ని త్రాగి ఆవులు చెట్ల క్రింద సేదదీరుతున్నాయి. గోపబాలురందరు మల్లికామాలలను ధరించియున్నారు. ఒక గోపబాలుడు తియ్యని గొంతుతో పాడడం మొదలుపెట్టాడు. అపుడు కొందరు వాద్యసహకారం చేయసాగారు. కొందరు చక్కగా నృత్యం చేసారు. గోపబాలురతో పాటు శ్రీకృష్ణుడు కూడ తన వేణువును ఊదుతూ వాద్యసహకారం కూర్చాడు. కృష్ణుని వేణుగానానికి బలరాముడు నృత్యం చేసాడు. మరొకసారి బలరాముని పాటకు కృష్ణుడు నృత్యం చేసాడు. ఇంతలో కృష్ణుడు గోపబాలురతో ”మిత్రులారా! మీ నృత్యము ఆపండి. ఇక మనం క్రొత్త ఆట ఆడదాం” అని అన్నాడు.
గోపబాలురందరూ పరిగెత్తుకుంటూ కృష్ణుని దగ్గరకు వచ్చి ”ఓ దామోదరా! ఆ క్రొత్త ఆటేమిటో చెబుతావా?” అని అడిగారు.
”వినండి. మనం రెండు జట్లుగా విడిపోదాము. ఒక జట్టు బలశాలియైన బలరామునితో ఉంటుంది, రెండో జట్టు నాతో ఉంటుంది” అని చెప్పిన కృష్ణుడు ఆట వివరాలు వివరించాడు. ఓడిన జట్టువారు గెలిచినజట్టువారిని తమ వీపుపై మోయాలని కన్నయ్య తెలిపాడు. అదే సమయంలో ప్రలంబాసురుడనే దానవుడు చాటుగా వచ్చి గోపబాలురతో కలిసిపోయాడు. వాడు కృష్ణుని పక్షాన ఉండడము వలన విజేతలైన బలరాముని జట్టును మోయాల్సి వచ్చింది. అదే అదనుగా వాడు బలరాముని తన వీపుపై ఎత్తుకున్నాడు. ఆ విధంగా బలరాముని వీపుపై ఎత్తుకొని ఆ అసురుడు దూరంగా తీసికొనిపోసాగాడు. మొదట్లో బలరాముడు జరుగుతున్న విషయానికి ఆశ్చర్యపడినప్పటికిని వెంటనే పరిస్థితిని అర్థం చేసికొన్నాడు. అపుడు మందహాసం చేస్తూ అతడు ”ఓ దామోదరా! హే మనోరాముడా! వెర్రితనము బుద్ధిని హరించినట్లు ఈ దానవుడు నన్ను హరించాలని చూస్తున్నాడు. నేనిపుడు ఏం చేయాలో చెప్పవలసినది” అని గట్టిగా అరిచాడు.
అపుడు కృష్ణుడు మేఘగంభీరస్వరంతో ”బలదేవా! ఎందుకు నీవు మాయకు లోనవుతున్నావు? మన దివ్యశక్తిని తలచుకో. వెంటనే ఈ దానవుణ్ణి వధించు” అని అన్నాడు. ఆ మాటలు చెవిన పడగానే కృష్ణసోదరుడగు బలదేవుడు తన పిడికిలితో దానవుని శిరస్సును భగ్నం చేసాడు. ప్రాణాలు కోల్పోయిన ప్రలంబుడు తన నిజరూపంతో బయటపడ్డాడు. అపుడు కర్పూరం కన్నను తెల్లనైన బలదేవుడు అసురుని భుజాలపై కూర్చొని విశ్వపు అంచున ఆసీనుడైన పూర్ణచంద్రునిలాగా కనిపించాడు. బలదేవుని ముష్టిఘాతానికి అసురుడు రక్తం క్రక్కుకున్నాడు. వాడి ఒళ్ళంతా రక్తమయమైంది. ఆ విధంగా వాడు నేల కొరిగాడు. అపుడు దేవతలు ఆకాశం నుండి బలరామునిపై పుష్పవృష్టి కురిపించారు.
ప్రలంబాసురుడు గొప్ప తాంత్రిక విద్యను ప్రదర్శించినప్పటికిని తాళధ్వజుడైన బలదేవుని ప్రబలమైన పిడికిలిపోట్లకు నశించిపోయాడు. అపుడు ఇంద్రుడు బలదేవునికి ”ప్రలంబఘ్న” (హృదయం నుండి సమస్త పాపాలను తొలగించేవాడు) అనే బిరుదు నిచ్చాడు. బలదేవుడు దానిని ఆనందంతో స్వీకరించాడు. తరువాత బలదేవుడు తన అనుజుడైన దామోదరుని, ఇతర గోపబాలురను భాండీరవటఛాయలో కలుసుకొని ఆనందించాడు.
(శ్రీల కవికర్ణపూర విరచితమైన ‘ఆనందబృందావన చెంపు’ గ్రంథములో నుండి చెప్పబడింది. శ్రీబలదేవుని ఆవిర్భావము ఆగష్టు 29వ తేదీన వస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలి)

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.