భగవద్దర్శన్‌ ప్రయోజనమేమిటి?

Blog 1 photoఅసలు భగవద్దర్శన్‌ ప్రయోజనమేమిటి? ఎందుకు అది శ్రీల ప్రభుపాదులవారిచే ఆవిష్కరించబడింది? ఈ ప్రశ్నలకు సమాధానము శ్రీల ప్రభుపాదులచే మొదటి సంచికలోనే చెప్పబడింది. అంతే కాకుండ ఒక ప్రత్యేకమైన ఉత్తరంలో ఆయన ఆ విషయాన్ని భారత రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌కు వ్రాసారు. ఆ వివరాలేమిటో చూద్దాం!
మొదటి పేజీలో ”బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌” పేరు క్రింద శ్రీల ప్రభుపాదులు ఈ పత్రిక యొక్క ప్రయోజనాన్ని ఈ విధంగా చెప్పారు. ”మనస్సుకు శిక్షణను ఇవ్వడానికి, మానవనైజాన్ని ఆత్మస్థితికి ఉద్ధరించడానికి సాధనము”. అంటే భగవద్దర్శన్‌ యొక్క ఏకైక ప్రయోజనము బద్ధజీవుని అసలైన శత్రువైనట్టి మనస్సుకు శిక్షణను ఇవ్వడం, ఆ విధంగా మానవనైజాన్ని ఆత్మస్థితికి ఉద్ధరించడం. బద్ధస్థితిలో మానవుడు సాధారణంగా ఇంద్రియమానసిక స్థితులలోనే తిరుగాడుతూ ఆహారము, నిద్ర, భయము, మైథునకలాపాలలో మునిగిపోయి ఉంటాడు. అతడు ఉపయోగించే బుద్ధి కేవలము లౌకిక విజయాలకు, ఎక్కువ ఆర్థికాభివృద్ధికే గాని ఆత్మతత్త్వ విచారణకు కాదు. కాబట్టి బుద్ధిని అతడు సరియైన విధంగా వాడుకునే అవకాశమే ఉండదు. అటువంటప్పుడు అతడు జంతువులతో సమానమే అవుతాడు. అటువంటి బద్ధమానవుడిని నిజమైన మనిషిగా తీర్చిదిద్దాలంటే మనస్సులో మార్పు రావాలి, బుద్ధిలో చేతనము కలగాలి, తద్ద్వారా అతడు ఆత్మస్థితిలో నెలకొనాలి. అందుకే శ్రీల ప్రభుపాదులు ”బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌” (భగవద్దర్శన్‌) పత్రికను మనస్సును నియంత్రించి శిక్షణ నొసగే సాధనంగా పేర్కొన్నారు. అదే చక్కగా జరిగినపుడు బుద్ధి సచేతనమై మనిషి ఆత్మస్థితిలో నెలకొంటాడు. అపుడు మహామనీషిగా అవుతాడు. అపుడు అతడు తిరిగి జన్మమృత్యువలయంలో చిక్కడు. మానవజన్మను అతడు సార్థకం చేసికొంటాడు.
ఈ విషయాన్నే శ్రీల ప్రభుపాదులు ఒక ప్రత్యేకమైన ఉత్తరంలో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌కు ఈ క్రింది విధంగా తెలియజేసారు. ఎంతో ధైర్యంతో, విశ్వాసంతో దేశరాష్ట్రపతికే శ్రీల ప్రభుపాదులు ఈ విషయాన్ని వ్రాయడం భగవద్దర్శన్‌ పై ఆయనకు ఉన్నట్టి పూర్తి నమ్మకాన్ని, గురుకృష్ణుల కృపపై అచంచలమైన విశ్వాసాన్ని వెల్లడి చేస్తుంది.
1956లో శ్రీల ప్రభుపాదులు తాము ముద్రించిన కొన్ని ”బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌” ప్రతులను, వాటితో పాటు ఒక ప్రత్యేకమైన ఉత్తరాన్ని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌కు వ్రాసారు.
”ప్రస్తుత భౌతికదేహాన్ని త్యజించిన తరువాత భగవద్ధామానికి వెళ్ళగలిగే ఉపాయం నా దగ్గర ఉన్నది. ప్రపంచములోని సమకాలీన పురుషులను, స్త్రీలను అందరినీ నాతోపాటు తీసికొని పోవడానికే నేను ఈ ”బ్యాక్‌టు గాడ్‌హెడ్‌” పత్రికను ప్రారంభించాను. ఆ దారిలో వెళ్ళడానికి దీనినొక సాధనంగా నేను చేసికొన్నాను. ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టిన తరువాత నేను భగవద్ధామానికి తప్పకుండ వెళతానని అన్నందుకు నన్ను ఏదో అద్భుతమైన వ్యక్తి యనో లేదా పిచ్చివాడననో అనుకోకండి! అది ప్రతియొక్కరికి, మనందరికీ సాధ్యమే!”
”తాను పంపించిన ‘బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌’ పత్రికలలోని శీర్షికల పేర్లనైనా పరిశీలించమని శ్రీల ప్రభుపాదులు రాష్ట్రపతిని అర్థించారు. అసురుల పాలన వచ్చే అవకాశం ఉన్నదని, అందుకే సంఘమును పతనం చెందకుండా కాపాడవలసిందని ఆయన రాష్ట్రపతిని పదేపదే అడిగారు. తాను పంపించిన పత్రికలను చూసిన తరువాత తనకు ఆయనతో (రాష్ట్రపతి) సమావేశమయ్యే అవకాశాన్ని ఇవ్వమని అర్థించారు. నేనిప్పుడు ఒంటరిగా అరణ్యరోదనం చేస్తున్నాను” అని శ్రీల ప్రభుపాదులు ఆ ఉత్తరంలో వ్రాసారు. కాని ఆ ఉత్తరానికి భారతరాష్ట్రపతి నుండి ఉత్తరం రాలేదు.
శ్రీల ప్రభుపాదులు భారతరాష్ట్రపతికి వ్రాసిన ఆ ఉత్తరము ద్వారా భగవద్దర్శన్‌ పత్రిక ప్రయోజనము సుస్పష్టంగా తెలుస్తుంది. ఆ ఉత్తరమే కాకుండ తొలిసంచికలోనే శ్రీల ప్రభుపాదులు నిర్వచించినట్లు భగవద్దర్శన్‌ మనస్సును నిగ్రహించే సాధనం, మనిషిని ఆత్మస్థితిలోనికి తీసికొని వెళ్ళగలిగే సాధనం. మనస్సు ప్రశాంతమై, బుద్ధి పరిపక్వత చెందనిదే మనిషి సత్త్వగుణస్థితిలోనికి రాలేడు. సత్త్వగుణస్థితికి రానిదే అతనికి ఆత్మస్థితి అర్థం కాదు. అది అర్థం కానిదే అతనికి ప్రశాంతత దొరికే అవకాశమే ఉండదు. భగవద్దర్శన్‌ ప్రభావాన్ని శ్రీల ప్రభుపాదులు ఎంచుకొన్న మరొక వాక్యం కూడ సూచిస్తుంది.
”శ్రీకృష్ణుడు సూర్యుని వంటివాడు, మాయ అంధకారము వంటిది; కృష్ణుడు ఉన్న చోట మాయ నిలువలేదు.”
జీవితంలో మాయను తొలగించి శ్రీకృష్ణునే కేంద్రబిందువుగా మలచుకొనే మార్గాన్ని చెప్పేదే భగవద్దర్శన్‌. ఇపుడు ఈ ఆధ్యాత్మిక పత్రిక 70 వసంతాలు పూర్తి చేసికొంది. ఇపుడు ఇది ప్రపంచములోనే అనేక భాషలలో ప్రచురించబడుతోంది. శ్రీల ప్రభుపాదులు ప్రపంచ వ్యాప్తంగా కృష్ణభక్తిభావనను ప్రచారం చేసే సమయంలో ఆయన శిష్యులు ”బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌” పత్రికను 1974వ సంవత్సరములో దాదాపు నలభైలక్షల ప్రతులను అమ్మి ఒక నూతనమైన రికార్డును స్థాపించారు. అటువంటి అద్భుతాలను మళ్ళీ మళ్ళీ చేసే కార్యభారాన్ని శ్రీల ప్రభుపాదుల ప్రశిష్యులు ఇప్పుడు తమ భుజస్కంధాలపై వేసికోవాలి. ముఖ్యంగా భగవద్దర్శన్‌కు 75 వసంతాలు నిండే వేళకు, అంటే ఇంకో ఐదేళ్ళ సమయంలో కృష్ణచైతన్యసంఘ సభ్యులందరు కృతనిశ్చయులై ప్రతీ భాషలోను నెలకు కనీసం పాతికవేల నుండి యాభైవేల వరకు భగవద్దర్శన్‌ పత్రికలను పంచే ఉన్నతమైన స్థితికి రావాలి. అపుడే ఆనాడు శ్రీల ప్రభుపాదులు మనకు ఒనగూర్చిన మహోపకారానికి సవినయంగా కృతజ్ఞతను తెలిపినవారము అవుతాము. భగవద్దర్శన్‌ ఏదో సాధారణమైన ఆధ్యాత్మిక పత్రిక కాదు. శ్రద్ధాళువైన వ్యక్తిని నేరుగా కృష్ణధామానికి చేర్చే అమోఘమైన సాధనం. దీని పట్ల ఆసక్తుడైన వ్యక్తి నిశ్చయంగా ధన్యుడే అవుతాడు. హరేకృష్ణ!

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.