అసలైన నటులు

cover_page_marchఅసలైన నటులెవరో తెలిసికొనే ముందు అసలు నటన అంటే ఏమిటో తెలిసికోవడం మంచిది. తన స్వభావానికి, స్థితికి విరుద్ధంగా ఎవరైనా వర్తిస్తే అది నటన అవుతుంది. చీమకైనా అపకారం చేయనట్టి వ్యక్తి రంగస్థలం పైన లేదా వెండితెర పైన గొంతులు కోసే వ్యక్తిగా కనిపిస్తే అది నటన అవుతుంది. అదేవిధంగా కోటీశ్వరుడు కటిక బీదవానిగా నటించడము, మహాభయస్థుడు పదిమంది రౌడీలను ఒకేసారి చావగొట్టే హీరోగా నటించడము వంటివి ఇంకొన్ని ఉపమానాలు అవుతాయి. సినీనటులకు జనులు బ్రహ్మరథం పట్టడం కొత్తేమీ కాదు. అది ఏనాటి నుండో వస్తున్నది. కాని జనులు అసలైన నటులు తామేనని తెలిసికోలేకపోతున్నారు. వెండి తెరపై కనిపించే నటుడు చెప్పే మాటలు అతనివి కావు, భంగిమలు అతనివి కావు, పాటలు అతనివి కావు, భావప్రకటన అతనిది కాదు. అయినా అతనినే జనులు మహానటుడని ఆకాశానికి ఎత్తుతారు. ఆధ్యాత్మిక దృష్టిలో అసలైన నటులు స్వయంగా అందరు జీవులే. భగవద్ధామంలో ఉన్నప్పుడు భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉన్నట్టి జీవులే ఆ స్థానాన్ని విడిచి భౌతికజగత్తుకు రాగానే కృష్ణాంశగా తమ స్వభావాన్ని, స్థితిని మరచిపోయి విరుద్ధంగా వర్తిస్తారు. అంటే అతడు చేసేది నటనే కదా! అందుకే ఈ నటన ఒక్క రోజు కాదు, ఒక్క నెల కాదు. యుగయుగాలు సాగుతుంది. వైకుంఠంలో ద్వారపాలకులైన జయవిజయులు తమ ప్రభువు ఎప్పుడు కనిపించినా వంగి నమస్కరించేవారు, కీర్తించేవారు. ఎల్లప్పుడూ ఆతని గురించే చర్చించుకొనేవారు. కాని ఎప్పుడైతే వారు వైకుంఠాన్ని విడిచిపెట్టవలసి వచ్చిందో అప్పుడు వారు తమ దాసస్వభావానికి విరుద్ధంగా భగవంతునికి విరోధులయ్యారు. స్వభావ విరుద్ధ వర్తనము నటనే కదా! అదే విధంగా నిత్య కృష్ణదాసులమైన మనము ఈ భౌతికజగత్తులో కృష్ణేతరమైన కార్యాలలో నెలకొంటున్నాము అంటే అది నటనే. అయితే ఇందులో జీవులు ఎవరో రాసిన మాటలను చెప్పడం, ఎవరో కూర్చిన బాణీలతో పాటలు పాడడం, ఎవరి దర్శకత్వంలోనో భావప్రకటము చేయడం కాకుండ తమంతట తామే అనేకానేక పాత్రలను అనేకానేక జన్మలలో పోషిస్తుంటారు. అటువంటప్పుడు అసలైన నటులు జీవులే కదా! ఎప్పుడైతే జీవుడు ఈ భౌతికజగత్తులో తాను చేస్తున్నది కేవలం నటనే యని తెలిసికొని తన స్వభావానికి తగినట్టి కృష్ణసేవా కార్యాన్ని చేపడతాడో అపుడు రంగస్థలం మీద నుండి వైదొలగే యత్నం మొదలుపెట్టినవాడౌతాడు. జగన్నాటకంలో అనేక యుగాలుగా అనేక పాత్రలను పోషిస్తూ అలసిపోయే జీవుడు ఎప్పుడైతే ఈ రహస్యాన్ని తెలిసికొంటాడో ఆ క్షణం నుండే పుణ్యభాగుల కోవలోనికి చేరుతాడు. కాబట్టి ఎవరైనా ఊర్ధ్వపుండ్రం పెట్టుకొని, పిలక పెట్టుకొని, గొంతెత్తి హరినామసంకీర్తన చేస్తూ నృత్యం చేస్తుంటే దానిని ఏదో బాహ్యప్రకటంగా భావించకూడదు. అది నిజంగా జీవుడు సహజస్థితిలో నిలిచే యత్నమే. కాని అది నటన అంటూ దానికి దూరంగా నిలిచేవారే అసలైన నటులు; కాగా శాస్త్రోపదిష్టమైన ఆ పద్ధతిని స్వీకరించి భక్తిలో తన్మయులయ్యే మహనీయులు జగన్నాటక సూత్రధారి ఆశ్రయంలో తిరిగి చేరబోయే ముక్తాత్ములు. హరేకృష్ణ!

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.