నూతన సంవత్సరానికి ఆధ్యాత్మికలక్ష్యాలు

cover_page_decemberపాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతీ యత్నానికీ ఒక లక్ష్యం ఉంటుంది. అయితే ఆ లక్ష్యం హెచ్చుతగ్గు స్థాయిలకు చెంది ఉండవచ్చును. హెచ్చుస్థాయి లక్ష్యం అధిక పరిమాణంలో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తే తగ్గుస్థాయి లక్ష్యం తదనుగుణమైన ఫలాన్నే కలుగజేస్తుంది. భక్తియోగమనేది భౌతికజగత్తులో మానవుడు చేయగలిగే సర్వోత్తమమైన కార్యం. దాని లక్ష్యం భగవత్ప్రీతి. ఈ దివ్యమైన లక్ష్యంతో ఈ జగత్తులోని ఏ కార్యలక్ష్యము సరిపోలదు. అందుకే మన ఆచార్యులు తాము చేసే భక్తియుతసేవలో మహోన్నతమైన లక్ష్యాలు పెట్టుకొని మనకు మార్గదర్శనం చేసారు. నామాచార్య శ్రీల హరిదాసఠాకూరులు రోజుకు మూడు లక్షల హరినామాన్ని జపించే లక్ష్యం పెట్టుకున్నారు, శ్రీల సనాతనగోస్వామి ప్రతీరోజు గిరిరాజు గోవర్ధనునికి ప్రదక్షిణం చేసే లక్ష్యం పెట్టుకున్నారు, శ్రీల ప్రభుపాదులవారి గురుదేవులైన శ్రీ శ్రీమద్ భక్తిసిద్ధాంతసరస్వతీ ఠాకూరులు వందకోట్ల హరినామం జపించే మహోన్నత లక్ష్యం పెట్టుకున్నారు. సమస్త ప్రపంచానికి కృష్ణభక్తిని అందజేసిన కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు భాగవతాన్ని 60 సంపుటముల వ్యాఖ్యానంతో వెలువరించే లక్ష్యం పెట్టుకున్నారు. వారు ఈ విధంగా చేసినది మనలను ఉత్సాహపరచడానికే నని తెలిసికోవాలి. ఆ విధంగా మనం కూడ ఆధ్యాత్మికలక్ష్యాలతో ఆత్మానందాన్ని పొందడానికి నూతన సంవత్సరమే మంచి తరుణం. క్రొత్త సంవత్సరంలో క్రొత్త క్రొత్త నిర్ణయాలు తీసికోవడానికి జనులు ఉబలాట పడుతుంటారు. అలాగే మనం కూడా ఈ క్రొత్త సంవత్సరంలో ఆధ్యాత్మికలక్ష్యాలను ఏర్పరచుకునే యత్నం ఎందుకు చేయకూడదు?
ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పరచుకునే పద్ధతి అలవాటు కావడానికి మొదలు ఒక సంవత్సర లక్ష్యాలు ఏర్పాటు చేసికోండి. ఉదాహరణకు భగవద్గీత యథాతథాన్ని మొత్తం అధ్యయనం చేయడం ఈ నూతన సంవత్సర లక్ష్యంగా చేసికోవచ్చును. పాతికమంది చేత భగవద్గీత యథాతథం గ్రంథాలను కొనిపించే లక్ష్యం పెట్టుకోవచ్చు. వందమంది చేత భగవద్దర్శన్ చందా కట్టించే లక్ష్యం పెట్టుకోవచ్చును. 16 మాలల హరినామాన్ని క్రమం తప్పకుండా జపించే లక్ష్యం పెట్టుకోవచ్చు. మన రాష్ట్రంలో ఉన్న అన్ని నృసింహ క్షేత్రాలను దర్శించే లక్ష్యం పెట్టుకోవచ్చు. ఇంట్లో నెలకొకసారి హరినామ సంకీర్తన ఏర్పాటు చేసి వైష్ణవులకు ఆతిథ్యం ఇచ్చే లక్ష్యం పెట్టుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఇస్కాన్ కేంద్రాలను దర్శించే లక్ష్యం పెట్టుకోవచ్చు. ఏకాదశీవ్రతాన్ని పాటించే లక్ష్యం పెట్టుకోవచ్చు. ప్రతీనెల వైష్ణవులకు, భక్తులకు కొంత ధనం దానం చేసే లక్ష్యం పెట్టుకోవచ్చు. కుటుంబంలో అందరు కలిసి కనీసం అరగంట సేపు సంకీర్తన చేయడం, గీతాభాగవతాలను చదవడం వంటి కార్యక్రమం చేసే లక్ష్యం పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రతియొక్కరు తమ తమ పరిస్థితులు, ఆర్థికస్తోమత, సమయానుకూలతను బట్టి ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకుంటే నిశ్చయంగా భక్తియోగంలో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక లక్ష్యసాధన తరువాత కలిగే దివ్యానుభూతి స్వయంగా అనుభవించవలసినదే గాని చెబితే అర్థం కాదు. కాబట్టి వెంటనే నూతన సంవత్సరానికి మీ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. దానిని ఒక చిన్న కాగితం మీద వ్రాసి మీరెక్కడైతే ప్రతీరోజు భగవదారాధన చేస్తారో అక్కడ గోడ మీద అంటించండి. అదే మీకు ప్రతీరోజు మీ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని గుర్తు చేస్తుంది. ఆ విధంగా మీ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోండి. హరేకృష్ణ! విజయోస్తు!

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.