విశ్వాసం

krishna-gita1మనిషి సుఖాభిలాషి, ఆశాజీవి. ఎన్ని కష్టాలలో ఉన్నప్పటికిని తనకు ఏదో ఒక రోజు సుఖం లభిస్తుందనే విశ్వాసంతో ఉంటాడు. ఆ విశ్వాసమే అతడిని కార్యోన్ముఖుని చేస్తుంది. అసలు ఈ విశ్వాసమనేది ఏమిటి? ఏ విశ్వాసం నిజానికి మానవునికి అసలైన ఫలితాన్ని ఇస్తుంది? అటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఏ విధంగా సాధ్యపడుతుంది? ఇటువంటి ప్రశ్నలు జిజ్ఞాసువైన వ్యక్తికి తరచుగా కలుగుతుంటాయి. భర్త తనను చక్కగా చూసుకుంటాడని భార్య విశ్వసిస్తుంది, తాము ముసలివారైనపుడు సంతానం తమ బాగోగులు చూస్తారని తల్లిదండ్రులు విశ్వసిస్తారు, తాము నమ్ముకున్న గురువు తమను ఉద్ధరిస్తాడని సాధకులు విశ్వసిస్తారు, తాము చేసే పూజలు తమ కష్టాలను గట్టెక్కిస్తాయని ఆర్తులు విశ్వసిస్తారు. ఏ దేవతారూపాన్ని భజించినా ఒనగూడే చరమ ప్రయోజనము ఒక్కటేనని మాయావాదులు విశ్వసిస్తారు. ఈ విశ్వాసమనే పదాన్ని శ్రీచైతన్యులు సనాతనగోస్వామికి వివరిస్తూ అది ”శ్రద్ధ” అనేదాని నిర్వచనమని తెలిపారు. అంటే మనిషి ఒకానొక కార్యంలో విశ్వాసం చూపిస్తున్నాడంటే దానిలో శ్రద్ధను కలిగి ఉన్నాడని అర్థం. అయితే జగత్తులో నిజంగా విశ్వసించాల్సింది ఏమిటి?
”కృష్ణభక్తిని చేస్తే సమస్త కార్యాలు చేసినట్లే అవుతుంది” అనే విషయాన్ని సుదృఢంగా నమ్మితే, త్రికరణ శుద్ధిగా ఒప్పుకుంటే అది నిజమైన శ్రద్ధ అవుతుంది. అదే విశ్వాసం. ఈ విషయమే మన కర్మలలో, మన ఆలోచనలలో వ్యక్తమౌతూ ఉంటుంది. ”నేను శరణుజొచ్చిన ప్రామాణిక గురువు వ్యాస ప్రతినిధి. ఆయన కృపతో నేను భవసాగరాన్ని దాటుతాను. ఆయన ఆజ్ఞాపాలనమే ఆయనకు నేను చేసే సేవ” అనే విశ్వాసమే సాధకుడు చూపవలసిన శ్రద్ధ. ”నేను జపించే హరినామము గురుకృష్ణుల కరుణ వలన నాకు లభించింది. ఇదే నాకు భగవత్సాంగత్యాన్ని కలుగజేస్తుంది” అనేది కూడ అసలైన విశ్వాసం. ”కృష్ణకథాశ్రవణమనే నౌకను ఎక్కడం ద్వారా నేను సమస్త దుఃఖాలను దాటుతాను” అనే విశ్వాసం మనిషిని కృష్ణకథల పట్ల ఆకర్షితుని చేసి ఈ జగత్తులో సుఖభాగుని చేస్తుంది. కాబట్టి కృష్ణభక్తి పట్ల, గురుసేవ పట్ల చూపే విశ్వాసమే అసలైన విశ్వాసం. నిజానికి వాటి పట్ల చూపే శ్రద్ధయే విశ్వాసమని చెప్పబడుతుంది. భౌతికభావనలో ప్రతీమనిషి కలిగి ఉండే విశ్వాసాలు కేవలము మనోధర్మాలు. అవి కర్మానుసారము సత్యాసత్యాలుగా మారుతుంటాయి. కాని ఆత్మకు సంబంధించినట్టిదియైన కృష్ణభక్తి పట్ల చూపే శ్రద్ధ (విశ్వాసం) శాశ్వతమై ఆత్మస్వరూపుడైన జీవునికి పరమశ్రేయస్సును కూరుస్తుంది. మరొక ముఖ్యమైన విషయమేమంటే చెట్టు మొదలుకు నీరు పోస్తే కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, పండ్లు అన్నింటికి పోషణ చేసినట్లు అయ్యే రీతి, అసలైన కృష్ణభక్తి పట్ల ప్రదర్శించే విశ్వాసం అన్యవిషయాల పట్ల చూపే విశ్వాసాలను కూడ సఫలం చేస్తుంది. మరి ఆలస్యమెందుకు? మన సంపూర్ణ విశ్వాసాన్ని కృష్ణభక్తి పైననే, గురుసేవ పైననే ఉంచి జన్మను సార్థకం చేసికోండి. అంతులేని లౌకిక విశ్వాసాలతో అల్లకల్లోలమయ్యే బదులు అచ్యుతుని యందు అకుంఠితమైన విశ్వాసాన్ని ఉంచి చ్యుతి లేనట్టి దివ్యఫలితాలను సాధించండి. విజయోస్తు!

- వైష్ణవాంఘ్రిసేవక దాసు

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.