ధ్రువసందేశం

Krishna-Lifting-Govardhan”ధ్రువసందేశం” అనే మాటకు రెండు అర్థాలను చెప్పుకోవచ్చును. ఒకటి భక్తధ్రువుడు ఇచ్చిన సందేశం, రెండవది ”నిశ్చయమైన సందేశం”. మహానుభావులు చెప్పే మాటలన్నీ సందేశాలే అయి ఉంటాయి. అంతే కాదు, వారి చేతలు కూడ సందేశాన్ని ఇస్తాయి. ఐదేళ్ళ ప్రాయంలో ధ్రువుడు చేసిన కార్యమే కలకాలం భక్తులకు దివ్యసందేశంలాగా ఉండిపోయింది. ఆరునెలలలో తీవ్రమైన తపస్సు ద్వారా భగవద్దర్శనాన్నే పొందగలిగిన ధ్రువుని కార్యము అనితరసాధ్యమే అనిపిస్తుంది. అయినా దాని నుండి భక్తులు స్ఫూర్తిని పొందవచ్చును. మొదటి నెలలో కేవలము మూడు రోజులకు ఒకసారి అతడు పండ్లు తిని నామధ్యానంలో నిలిచాడు, రెండవ మాసంలో ఆరు రోజులకు ఒకసారి ఎండుటాకులను, గడ్డిని తిని నామసాధన చేసాడు, మూడవ మాసంలో తొమ్మదిరోజులకు ఒకసారి మంచినీళ్ళు త్రాగి నామజపం చేసాడు, నాలుగవ మాసంలో పన్నెండు రోజులకు ఒక్కసారి వాయువును భక్షించి నిలిచాడు, ఐదవ మాసంలో అతడు శ్వాసక్రియనే స్తంభింపజేసి చలనము లేకుండ ఒంటికాలిపై నిలిచి పరబ్రహ్మచింతనలో మునిగిపోయాడు. అటువంటి అద్భుతమైన తపస్సుకు ఆరవనెలలో అచ్యుతుడు ప్రత్యక్షమై ధ్రువుని కీర్తిని ఆచంద్రార్కము కావించాడు. తపస్సు ద్వారానే భగవద్దర్శనం సాధ్యమౌతుంది కాని తమస్సులో కాదని తన అకుంఠిత కార్యం ద్వారా ధ్రువుడు లోకానికి సందేశమిచ్చాడు.
భగవదవతారమైన ఋషభదేవుడు కూడ తన పుత్రుల ద్వారా లోకానికి ఉపదేశం చేస్తూ ”మానవజన్మ లభించినది శునకసూకరాలకు కూడ లభించే ఇంద్రియభోగాల కొరకు కాదు. దివ్యమైన భక్తియోగాన్ని పొందడానికి తపస్సు చేసే నిమిత్తమే మానవజన్మ లభించింది” అని అన్నాడు. అంటే మహనీయుల మాటలను బట్టి చూసినా, చేతలను బట్టి చూసినా వారు జనులకు బోధించింది తపస్సే. తపస్సు ద్వారా త్రివిధ తాపాలు తొలగడమే కాకుండ మానవజన్మ ప్రయోజనం కూడ ఈడేరుతుంది. కాబట్టి తపస్సు కొరకు తహతహలాడాలే గాని తప్పించుకోకూడదు. అయితే ఈ తపస్సుల గురించి గీతాచార్యుడు తెలుపుతూ వాటిని మనసా, వాచా, కర్మణా చేయవచ్చునని ఉపదేశించాడు. భగవంతుడు, బ్రాహ్మణులు, గురుదేవుడు, తల్లిదండ్రులు వంటి వారిని పూజించడము, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి శారీరిక తపస్సు. సత్యవాక్కులను, ప్రియమైన వాక్కులను, హితకరమైన వాక్కులను, ఉద్వేగాన్ని కలుగజేయని వాక్కులను పలకడము, అంతే కాకుండ నిత్యము వేదవాఙ్మయాన్ని చదవడము అనేవి వాచిక తపస్సు. తృప్తి, సౌమ్యత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, అస్తిత్వాన్ని పవిత్రము చేసికోవడము మానసిక తపస్సు అవుతుంది. అయితే వీటిని కేవలము శ్రీకృష్ణభగవానుని ప్రీత్యర్థమే శ్రద్ధతో చేసినపుడు అది సాత్త్వికమైన తపస్సు అవుతుంది. ఎప్పుడైతే మనిషి ఈ పద్ధతులను లోకసన్మానము కొరకు చేస్తాడో అప్పుడది రాజసిక తపస్సు అవుతుంది. ఇక తనకు, ఇతరులకు హాని కలిగే రీతిలో, నష్టము కలిగే రీతిలో చేయబడే తపస్సు తమోగుణ తపస్సు అవుతుంది.
సారాంశమేమంటే తపస్సే ఆధ్యాత్మికజీవనానికి నాడి వంటిది. దానిని బట్టి ఆధ్యాత్మిక స్వస్థత అర్థమౌతుంది. నిత్యము హరేకృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు జపించడము, ఏకాదశి రోజు తప్పకుండా ఉపవాసము ఉండడము, ప్రతీరోజు గీతాభాగవతాలను పఠించడము, ఏది దొరికితే అది తినకుండ కేవలం కృష్ణప్రసాదాన్నే తినడము అనేవి సాధకుడు చేయవలసిన అనివార్యమైన తపస్సు. ఇదే గురుసాధుశాస్త్రాలు తెలిపిన నిశ్చయమైన సందేశం. హరేకృష్ణ!

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.