పండుగ సంబరాలు

Festivals”కలిమి గలవానికి ప్రతీరోజు పండుగే” అన్నది ఒక సామెత. బంధుమిత్రుల సమాగమముతో, పెద్దల ఆశీర్వచనాలతో, నోరూరించే విందులతో మనస్సును అలరించే వినోదముతో, కొంత భగవద్భక్తితో మానవుడు పండుగపూట సంబరము చేసికొంటాడు. సాధారణంగా మన వేదసంస్కృతిని బట్టి పండుగలన్నీ భగవత్సంబంధితమే అయియుంటాయి. అందువలన పూజలు వ్రతాలు మన పండుగ సంబరాలలో ముఖ్యకార్యక్రమము అవుతాయి. అంటే ఇతర రోజులలో సాంసారిక కలాపాలలో తలమునకలై ఉండే మానవులు కనీసము పండుగపూటైనా నిజమైన భగవత్సంబంధిత సంబరములో మునిగేటట్లు మన పండుగలు పెద్దలచే నిర్ణయించబడ్డాయి. ప్రతియొక్కరు అటువంటి సంబరాలలో మునిగేందుకు ఈ నెలలో ఎన్నో పండుగలు వస్తున్నాయి. అవే శ్రీబలరామ జయంతి, శ్రీరాధాగోవిందుల ఊయల మహోత్సవము. నిజానికి కృష్ణభక్తి యనే శాశ్వత కలిమి కలిగిన కృష్ణభక్తులకు ప్రతీరోజు పండుగే. ఇది మనకు భక్తుల జీవితాలలో స్పష్టంగా కనిపిస్తుంది. పండుగ సంబరాలు అందరికీ ఎందుకు నచ్చుతాయని ప్రశ్నిస్తే మనిషి ఆ పూటకైనా అన్ని చింతలను, చికాకులను మరచిపోయి ఉల్లాసంగా ఉండడానికి ప్రయత్నిస్తాడని సమాధానం చెప్పవలసివస్తుంది. చక్కెరవ్యాధి ఉన్నవాడైనా ”పండగపూటే కదా” అంటూ మిఠాయిని నోట్లో వేసికొంటాడు. ఇదీ పండుగ సంబరాలలోని రహస్యం.
అయితే శ్రీకృష్ణునే తమ జీవితములో కేంద్రబిందువుగా చేసికొన్నట్టి విశుద్ధభక్తులకు ప్రతీరోజు పండుగగానే ఉంటుంది. ఈ జగత్తు శాశ్వతమైన ప్రయోజనాన్ని సాధించడానికి ఉన్నట్టి తాత్కాలికమైన స్థానమని వారికి స్పష్టంగా తెలిసి ఉంటుంది. అందుకే వారు కృష్ణలీలాకీర్తనమనే నిత్యపండుగ సంబరాలలో ఉంటారు. వారు భగవంతుని కోరుకునేది కూడ అదే. వారి జీవితాలు సామాన్యంగాను, ఒక్కొకప్పుడు దారిద్య్రముతోను ఉన్నట్లు కనిపించినా ఆధ్యాత్మికదృష్టిలో వారు పండుగ సంబరాలలోనే ఉన్నారు. ఇది మనకు మథురాపురములోని మాలాకారుని జీవితంలోను, ద్వారకలో శ్రీకృష్ణుని సందర్శించిన కుచేలుని జీవితంలోను, ఇంకెన్నో సందర్భాలలోను కనిపిస్తుంది. వినమ్రుడైన మాలాకారుడు కృష్ణబలరాములకు సుందరమైన పుష్పహారాలను సమర్పించి సేవించాడు. దానికి ప్రసన్నుడై శ్రీకృష్ణుడు వరాలను కోరుకొమ్మన్నాడు. అపుడు మాలాకారుడు అచంచలమైన కృష్ణభక్తిని, కృష్ణభక్తులతో చెలిమిని, సకల జీవుల యెడ దయను కోరుకున్నాడు. అపుడు దేవదేవుడు వాటిని ఇవ్వడమే కాకుండ బలాన్ని, దీర్ఘాయువును, సౌందర్యాన్ని, నిరంతర వంశవృద్ధిని కూడ ఇచ్చాడు. సాధారణ మానవుల సంబరాలకు ఇవే హేతువులు కదా! అయితే కృష్ణభక్తులు కృష్ణభక్తి అనే నిత్యపండుగ సంబరాలలో మునిగి వీటిని అప్రయత్నంగానే పొందుతుంటారు. ఇక కుచేలుని విషయాన్ని గమనిస్తే అతడు కృష్ణసందర్శనాన్ని పొందగోరాడే గాని ఇంకేదీ కోరలేదు. కృష్ణుడు కనిపించినా ఏదీ అడుగలేదు. కాని తన చిరిగిన బట్టలో కట్టిన కొన్ని అటుకులను సమర్పించాడు. నిజానికి అతడు వాటిని ఇవ్వలేదు, కృష్ణుడే వాటిని బలవంతముగా లాక్కొని ఒక గుప్పెడు తిన్నాడు. దానితో ఇంద్రుడైనా ఊహించలేనంత ఐశ్వర్యాన్ని కుచేలుడు పొందగలిగాడు. కనుక భాగవతములో చర్చించబడిన భాగవతుల జీవితాల నుండి స్ఫూర్తిని పొందుతూ ప్రతీరోజు పండుగ సంబరాల అనుభూతిని కలిగించే విశుద్ధ కృష్ణభక్తికై నిష్కపటంగాను, శ్రద్ధతోను యత్నిద్దాము. ఇదే మన తక్షణ కర్తవ్యం! హరేకృష్ణ!

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.