ముందుమాట

sp_introభగవద్దర్శన్‌ ఇ-పత్రిక పాఠకులకు నమస్కారాలు. ఈ భగవద్దర్శన్‌ తెలుగు ఆధ్యాత్మిక మాసపత్రికకు మూలమైనట్టి “బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌” ఆంగ్లపత్రిక 70 ఏళ్ళు పూర్తి చేసికొంటున్న శుభసందర్భంగా తెలుగు పత్రికకు ఇ-రూపాన్ని ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టి తెలుగు భాష మాట్లాడే భక్తులకు అందేటట్లు చేయడమే మా ఆశయం. భగవద్దర్శన్‌ తెలుగు ఆధ్యాత్మిక మాసపత్రిక అనేక సంవత్సరాలుగా మన రాష్ట్రంలోను, కొంత ఇతర రాష్ట్రాలలోను పంచబడుతోంది. అయితే ఇప్పుడు మేము చేసిన దివ్యయత్నం ద్వారా ఇది సర్వత్ర అందరికీ లభించే అవకాశం కలిగింది. భగవద్దర్శన్‌కు ఉన్నట్టి 70 ఏళ్ళ చరిత్రను మీరు ఈ సైట్‌లోనే “చరిత్ర” (హిస్టరీ) శీర్షికలో విపులంగా చదువగలరని మా మనవి. అంతే కాకుండ భగవద్దర్శన్‌ను ప్రారంభించడానికి దారితీసిన సంఘటనలు, దీని ముఖ్యమైన ప్రయోజనము, ఈ పత్రికను గురించి దీని వ్యవస్థాపకులైనట్టి కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు చెప్పిన ఉపదేశాలను “ప్రయోజనం” (పర్పస్‌) శీర్షికలో చదువగలరు. శ్రీల ప్రభుపాదులవారి అభిమతానికి తగ్గట్టుగా కృషిచేస్తూ ప్రతీ నెల ఈ పత్రికను ముద్రిస్తున్నట్టి సంపాదకవర్గంతో పరిచయము “సంపాదకవర్గం” (ఎడిటోరియల్‌ బోర్డ్‌) శీర్షికలో మీకు కలుగుతుంది.

మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు, చివరకు ముందు వెనుక అట్టలతో సహా ప్రతీ అంగుళం కృష్ణసంబంధ విజ్ఞానంతో నిండిన అద్భుతమైన ఆధ్యాత్మికపత్రికయే ఈ భగవద్దర్శన్‌ తెలుగు కూర్పు. ఇందులో తెలుగు పాఠకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని వారికి గౌడీయవైష్ణవ సిద్ధాంతము అరటిపండు ఒలిచి చేతిలో పెట్టిన విధంగా రచనలు చేయడం జరుగుతోంది. ఇందులో ఉండే శీర్షికలను కొద్దిగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.
ఇందులో ముఖ్యంగా ఉండే శీర్షికలలో శ్రీల ప్రభుపాదులవారి భాగవత ప్రవచనము మొదటిది. తరువాత ఆయన వ్రాసిన భగవద్గీత యథాతథము, భగవద్గీత ఉపన్యాసాల ఆధారంగా వచ్చే “గీతోపదేశము” రెండవది. దీని ద్వారా పాఠకులకు భగవద్గీతలోని శ్లోకాలకు విస్తృతమైన వివరణము లభిస్తున్నది. శ్రీల ప్రభుపాదుల మహోన్నత రచనయైనట్టి శ్రీచైతన్యచరితామృతము గ్రంథాన్ని కొద్దిగా పరిచయము చేయడానికి “శ్రీచైతన్యచరితామృత బిందువు” ఈ పత్రికలోని మూడవ అంశము. తరువాత శ్రీమద్భాగవతాన్ని కథల రూపంలో “భాగవతకథలు” శీర్షిక క్రింద పాఠకులకు అందజేస్తున్నాము. దీని ద్వారా పాఠకులకు శ్రీమద్భాగవతాన్ని సరళరూపంలో అర్థం చేసికొనే అవకాశం కలుగుతున్నది. కలియుగంలో యుగధర్మము హరినామసంకీర్తనమే కాబట్టి హరినామము గురించి శ్రీల ప్రభుపాదులు, ఇతర ఆచార్యులు తెలియజేసిన ఉపదేశాలను “హరినామసుధ” శీర్షిక క్రింద అందజేస్తున్నాము. కథలు చదవాలంటే ఆబాలగోపాలానికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. అందుకే గౌడీయవైష్ణవ తత్త్వాన్ని “తత్త్వబోధినీ కథలు” రూపంలో ప్రతీనెల అందజేస్తున్నాము. భగవద్దర్శన్‌ పత్రికను పట్టుకున్నవారు ఈ శీర్షికను ఎట్టి పరిస్థితిలోను విడువకుండా చదువుతారంటే అతిశయోక్తి కాదు. అది పాఠకునిలో ఒక స్ఫూర్తిని, ఆలోచన దృక్పథంలో మార్పును కలుగజేస్తుంది. వీటితో పాటు సాధారణంగా ఆధ్యాత్మికవిషయంలో కలిగే సందేహాలకు శాస్త్రపరంగా ఇచ్చే సమాధానాలే “పరిప్రశ్న” శీర్షిక.

చిన్నపిల్లలలో సంస్కారము, భక్తి చిన్నప్పటి నుండే కలగాలి. కృష్ణభక్తి వారిలో బాల్యం నుండే వృద్ధి చెందాలి. అందుకే “బాలల భక్తివికాసం” అనే శీర్షిక ఉన్నది. భక్తిలో కొనసాగే గృహస్థులకు కూడ చక్కని మార్గదర్శనం చేసే “గృహస్థాశ్రమం” శీర్షిక చాలా ఆదరణ పొందినట్టిది. ఇటువంటి భక్తిసాధనలో దేహము చక్కగా సహకరించాలి కాబట్టి భక్తులందరికీ ఇంట్లోనే, స్వయంగా ఆరోగ్యసూత్రాలను పాటించగలిగేటట్టు “భక్తిసాధనకు ఆరోగ్యసాధన” అనే శీర్షికను పెట్టాము. ప్రకృతిపరంగా ఏ విధంగా జీవనాన్ని కొనసాగించవచ్చునో ప్రతీనెల దానిలో చెబుతున్నాము. ఏకాదశి మహిమను వివరిస్తూ నెలలో వచ్చే రెండు ఏకాదశి పర్వదినాల వివరాలు సంపూర్ణంగా అందిస్తున్నాము.

“శ్రీగురుపరంపర” శీర్షిక ద్వారా శ్రీశ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులవారి జీవితచరిత్రను విపులంగా పాఠకులకు ప్రతీనెల అందజేస్తున్నాము. ఈ శీర్షికలు అన్నింటితో పాటు డెభైఏళ్ళ క్రిందట శ్రీల ప్రభుపాదులు “బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌” పత్రికలో వ్రాసినట్టి అంశాల అనువాదాన్ని “అలనాటి భగవద్దర్శన్‌”
శీర్షికరూపంలో అందిస్తున్నాము. దీని ద్వారా ఆ సమయంలో ఆయన హృదయంలో ఉన్నట్టి ప్రచార తపన ఎవ్వరికైనా అర్థమౌతుంది.

చిన్నచిన్న శీర్షికల విభాగంలో నారదభక్తిసూత్రాలను, శ్రీల సనాతనగోస్వామి రచించిన “హరిభక్తివిలాసము” గ్రంథములోని విషయాలను కూడ ప్రతీనెల అందిస్తున్నాము. ఇంతే కాకుండ ఆయా నెలలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలను వివరిస్తూ అందించే శీర్షికలు కూడ ఉంటాయి. ముఖ్యంగా భగవద్దర్శన్‌ వెనక కవర్‌పేజీలో “ఊరూరా భగవద్దర్శన్‌” అనే అతిచిన్న సందేశం పాఠకులకు ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యాన్ని నిరంతరము తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము ప్రారంభించినట్టి భగవద్దర్శన్‌ ఇ-పత్రిక రూపం ద్వారా “ఊరూరా భగవద్దర్శన్‌” అనే మా సంకల్పం సాకారమౌతుందని విశ్వసిస్తున్నాము.
“కృష్ణుడు సూర్యుని వంటివాడు, మాయ అంధకారము వంటిది. కృష్ణుడు ఉన్నచోట మాయ నిలువలేదు” అనే వాక్యము ఈ భగవద్దర్శన్‌కు ముందు చెప్పే మాట. ఈ భగవద్దర్శన్‌ మీ ఆధ్యాత్మిక పయనంలో అన్ని విధాలుగా తోడ్పడుతూ మీ నిత్యమిత్రునిగా నిలుస్తుంది. శుభమస్తు! హరేకృష్ణ!

రేవతీరమణదాస్
ప్రధాన సంపాదకులు
ఇస్కాన్‌ మందిరము, తిరుపతి.