ఇంటింటా గౌరనితాయి!

Gaura Nitaiప్రతీజీవుడు సుఖాన్నే కోరుకుంటాడు; దుఃఖాన్ని ఎవ్వడూ కోరుకోడు. అయితే సుఖం కలగాలంటే శాంతి అవసరమౌతుందనే విషయం మాత్రం అత్యధికశాతం జనులకు తెలియదు. అంటే సుఖాన్ని వాంఛించేవాడు శాంతిని పొందడానికి ప్రయత్నించాలే గాని ఏవో వస్తువుల ద్వారా సుఖాన్ని పొందగలుగుతాననే భ్రాంతిని విడిచిపెట్టాలి. నిజంగా సుఖము ఆ విధంగా బజారులో కొనుక్కునేదే అయితే ఈ జగత్తు దుఃఖాలయం ఎట్లా అవుతుంది? సత్త్వగుణము ద్వారా శాంతి, శాంతి ద్వారా సుఖము, సుఖము ద్వారా ఆనందమనే క్రమంలోనే మనిషి ఆనందభాగుడు కాగలడు గాని అన్యథా కాదు. కాని ప్రస్తుత కలియుగములో సత్త్వగుణము సాధ్యమేనా? ఇది నిజంగా గంభీరమైన ప్రశ్న. కలియుగము దోషనిధి, కేవలము తమోగుణంతోనే నిండి ఉండేది. కలియుగంలో స్థానము, ద్రవ్యము, వ్యక్తి అందరు అపవిత్రస్థితిలోనే ఉండడం ముఖ్యంగా తెలిసికోవలసిన విషయము. ఇటువంటి పరిస్థితిలో యుగధర్మమైన హరినామసంకీర్తన ద్వారా పునీతులమై హృదయంలో కేశవుని నిలుపుకోవడమే సత్త్వగుణస్థితిని పొందడానికి ఏకైక మార్గము.
జనులలో కృష్ణభక్తిభావనను నింపడానికే గౌడాచలముపై సూర్యచంద్రులలాగా శ్రీగౌరాంగ మహాప్రభువు (శ్రీచైతన్యమహాప్రభువు), శ్రీనిత్యానందప్రభువు ఆవిర్భవించారు. ఒకే సమయంలో ఆవిర్భవించినవారై వారు జగత్తులో చీకటిని, శ్రద్ధావంతుల హృదయాలలో అవిద్యా అంధకారాన్ని తొలగించారు. వారిద్దరినీ కలిపి వైష్ణవులు ”గౌరనితాయి” అని పిలుస్తారు. సంకీర్తనకు పితరులు, యుగధర్మపాలకులు అయినట్టి శ్రీగౌరనితాయిలు కరుణాసముద్రులు; ఎవ్వరు ఎక్కువగా పతితులుగా ఉంటారో వారి మీద ఈ దివ్యసోదరులు ప్రత్యేక కరుణను చూపిస్తారు. కాబట్టి ప్రతియొక్కరు తమ ఇంటిని సత్త్వగుణములో నింపాలంటే, తద్ద్వారా శాంతినివాసముగా చేసికోవాలంటే, తద్ద్వారా సుఖాన్ని ఆనందాన్ని పొందాలంటే శ్రీశ్రీగౌరనితాయిలను ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. దీనిని వైష్ణవుల నిర్దేశములో చేయవలసి ఉంటుంది. శ్రీగౌరనితాయిలను అర్చించే పద్ధతి అతిసులభం. అదే హరినామసంకీర్తనము. అంటే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే అని కరతాళ మృదంగాలతో ప్రతీరోజు నియమబద్ధంగా కొంతసేపు కీర్తన చేయడం. ఇంట్లో వారందరు శుచిగా ప్రొద్దుననో లేదా సాయంత్రములోనో సమావేశ##మై శ్రీశ్రీగౌరనితాయిల ముందు ఈ విధంగా సంకీర్తన చేయడమే వారిని పూజించడమౌతుంది. ”కలియుగంలో సుమేధసులైనవారు, అంటే మంచి తెలివి గలవారు సంకీర్తన యజ్ఞము ద్వారా శ్రీచైతన్యమహాప్రభువును అర్చిస్తారని” శ్రీమద్భాగవతములో చెప్పబడింది. ఈ విధంగా ఇంటిల్లిపాదీ ప్రతీరోజు సంకీర్తనలో పాల్గంటే హృదయకల్మషాలు తొలుగుతాయి, కలహాలు అంతరిస్తాయి, ప్రసన్నత అందరిలో నిండుతుంది, శాంతి సర్వత్ర వెల్లివిరుస్తుంది. ఇక సుఖము దానంతట అదే ఇంట్లో నృత్యము చేస్తుంది. దీనిని బట్టి శ్రీగౌరనితాయిలు ఇంట్లో ఉండడం ఎంత ఆవశ్యకమో మీరు సులభంగా అర్థము చేసికోగలరు. కాబట్టి ”ఇంటింటా గౌరనితాయి” ఉండే రోజుకై ప్రతీక్షిద్దాము. అప్పుడే ఇల్లిల్లు ఆనంద నిలయంగా మారుతుంది. ఇళ్ళలో వారందరు ఆనందభాగులౌతారు. గౌరపూర్ణిమ ఉత్సవము (శ్రీచైతన్యమహాప్రభువు ఆవిర్భావ మహోత్సవము) వచ్చే ఈ నెలయే ఈ కార్యానికి శుభారంభము అగుగాక! హరేకృష్ణ!
(మార్చినెల 5వ తేదీ శ్రీచైతన్యమహాప్రభువు ఆవిర్భావము. మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలి)

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.