నామాశ్రితునికి పాపప్రాయశ్చిత్తం అక్కరలేదు

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే |
హరే రామ హరే రామ రామ రామ హరే హరే ||

Haridasa-Thakura1హరినామము శుద్ధసత్త్వగుణస్థితిలోనే సదా నిలిచి ఉంటుంది. కేవలము పరమ భాగ్యవంతులైన జీవులే హరినామాన్ని అనన్యంగా ఆశ్రయిస్తారు. హరినామోచ్చారణము సకల అనర్థాలను నివారిస్తుంది. తత్ఫలితంగా హృదయదౌర్బల్యం నశించిపోతుంది. హరినామము మీద అకుంఠితమైన శ్రద్ధ కలిగినపుడు పాపప్రవృత్తి పూర్తిగా తొలగిపోతుంది. అపుడు పూర్వ పాపాలన్నీ నశించిపోతాయి. హృదయం అపుడు పవిత్రతతో నిండిపోతుంది. హృదయంలోని పాపవాంఛల మూలము అజ్ఞానంలోనే ఉంటుంది. పాపము, పాపబీజము, అజ్ఞానము అనే మూడు అంశాలే బద్ధజీవుని దుఃఖానికి కారణాలు.
హరినామ సంకీర్తనము, జపము హృదయాన్ని మృదువుగా చేసి బద్ధజీవుల పట్ల దయను కలిగింపజేస్తుంది. నామాశ్రితుడు వారి ఆధ్యాత్మిక శ్రేయస్సు కొరకే నిరంతరము యత్నిస్తాడు. బద్ధజీవుల అనంతమైన కష్టాలను చూసి అతడు సహించలేడు; వారి దుఃఖాలను తొలగించడానికి అతడు శాయశక్తులా యత్నిస్తాడు. కామవాంఛ చేత, ఇంద్రియభోగవాంఛ చేత అతడు కలతచెందడు; కాంతాకనకాలకు విముఖుడై ఉంటాడు. ధర్మనిష్ఠుడైన అట్టి నామాశ్రితుడు భక్తియుతసేవకు అనుకూలమైనదానిని స్వీకరించి, ప్రతికూలమైనది త్యజిస్తాడు. శ్రీకృష్ణుడే తన రక్షకుడు, పోషకుడు, ఉద్ధారకుడని సర్వకాల సర్వావస్థలలో అతడు పూర్ణనిశ్చయంతో ఉంటాడు. దేహాసక్తి లేనివాడై అతడు ”నేను, నాది” అనే విషయాలకు దూరంగా ఉంటాడు. వినమ్రమైన మానసికస్థితిలో అతడు నిరంతరము హరినామాన్ని జపిస్తూ పాపకర్మప్రవృత్తి రహితుడై ఉంటాడు.
హరినామ జపకీర్తనలు పాపాన్నే కాకుండ, పాపప్రవృత్తిని కూడ ప్రక్షాళనము చేస్తాయి. ఈ సమయంలో నామరుచి కలగడం ఆరంభమౌతుంది; అలాగే పాపవాంఛ కూడ తొలగిపోతుంది. అయినా పూర్వపాపలేశము కొద్దిగా చిత్తములో ఉండే అవకాశం ఉండవచ్చును. కాని శ్రద్ధావంతుడైన హరినామాశ్రితునికి దానిని కూడ దాటగలిగే సంకల్పబలం నామాశ్రయం వలన కలుగుతుంది.
అనుకోకుండ లేదా కాకతాళీయంగా భక్తుడు పాపం చేయడం జరిగితే వేదాలలో చెప్పబడిన ప్రాయశ్చిత్త కర్మ చేసికోవలసిన అవసరం లేనే లేదు. అటువంటి పాపాలు కదిలిపోయే సంఘటనల వంటివి. హరినామామృతంలో అవన్నీ మునిగిపోతాయి. అందువలన హరినామాశ్రితుడు ఆధ్యాత్మికపథం నుండి నశింపు పొందడు. కాని అతడు నామబలం మీద పాపానికి ఒడిగడితే అది నామాపరాధమే అవుతుంది. అటువంటి కపటి అస్థిరుడై నశిస్తాడు. నామబలం మీద పాపాచరణము దశవిధ నామాపరాధాలలో ఒకటి. అది అత్యంత ఘోరమైనది. హరేకృష్ణ!

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.