మా ఊరు

Blog 24”మా ఊరు” అనే మాట పలుకని వారుండరు. ఉన్న ఊళ్ళో ఉండేవారైనా, పొరుగూరికి వెళ్ళినవారైనా, విదేశాలకు వెళ్ళినవారైనా ఈ మాటను ఏదో ఒక సందర్భములో అంటూనే ఉంటారు. అయితే ఈ విషయం ఏదో ఒక ప్రత్యేకమైన దేశానికి, ప్రాంతానికి చెందిన అలవాటు కాదు. ఇది మనిషి తత్త్వం, మనిషి నైజం. ప్రవాసంలో ఉన్న వ్యక్తికి తన ఊరికి వెళ్ళే బస్సును చూస్తే, రైలును చూస్తే ఆనందం కలుగుతుంది. తానెప్పుడు ఆ విధముగా ప్రయాణిస్తానా యని అతడు కలలు కంటాడు. ఎవరైనా తెలిసినవాళ్ళు కలిస్తే తన ఊరు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. ఇది మనందరి అనుభవము లోనిదే. అందుకే ”ఉన్న ఊరు, కన్నతల్లి” అనే మాటలు సర్వసాధారణమయ్యాయి. అయితే ”మా ఊరు” అని ఫలానా ఊరు గురించి చెబుతున్న వ్యక్తికి మరుసటి జన్మలో ఆ ఊరు గుర్తుంటుందా? అతని ఊరు మారిపోతుందే! మరి మాటిమాటికి మారిపోయే ఊరును ”మా ఊరు” అనడంలో అర్థమేమిటి? ఇది తాత్త్వికమైన ప్రశ్న. సామాన్యవ్యక్తికి తత్త్వము తెలియదు కాబట్టి ”మా ఊరు” అన్నప్పటికిని తత్త్వము తెలిసిన సాధకుడు ఈ మాటను అత్యంత సావధానంగా పలకాలి. సాధకుడు భౌతికజగత్తులో ఉన్నాడు కనుక ”మా ఊరు” అని ఫలానా ఊరి పేరును పైకి సంబోధించినా అసలైన తన ఊరునే అతడు మనస్సులో నిలుపుకొని ఉండాలి. ఇంతకూ జీవుని అసలు ఊరు ఏమిటి? భౌతికజగత్తులో ఎందుకు అతడు ప్రవాసంలో ఉన్నాడు? తన అసలు ఊరికి అతడు వెళ్ళే మార్గం ఏమిటి? దానికి ప్రయాణ సాధనం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని గురుముఖతః పొందేవాడే మానవజన్మను సఫలం చేసికొన్నవాడౌతాడు.
జీవుని అసలు ఊరు భగవద్ధామము. ఏదో సుఖాన్ని పొందుదామని అతడు ఈ భౌతికజగత్తుకు ప్రవాసిగా వచ్చాడు. ఇక ఇక్కడ మాయలో పడి తాను జన్మించిన ఊరునే ”మా ఊరు” అనుకుంటూ కాలం గడిపివేస్తున్నాడు. జన్మస్థలమే పుణ్యభూమి యని భావించే మనిషి గోవు లేదా గాడిదతో సమానమని భాగవతంలో చెప్పబడింది. మానవజన్మ వచ్చింది మాయ నుండి బయటపడడానికే గాని మాయలో కూరుకొనిపోవడానికి కాదు. మాయలో కూరుకొనిపోవడానికి మిగతా జన్మలు ఎలాగూ ఉన్నాయి. అందుకే మానవజన్మను పొందినవాడు, గుర్వాశ్రయాన్ని అదృష్టవశాత్తుగా పొందినవాడు తన అసలైన ఊరు భగవద్ధామమే అని తెలిసికోవాలి. మరి మన అసలైన ఊరికి వెళ్ళే మార్గమేమిటి? ”ఎవరైతే అంత్యకాలంలో నన్నే స్మరిస్తారో వారు నన్నే చేరుకుంటారు. ఎక్కడికి వెళితే ఇక తిరిగి రావలసిన అవసరము ఉండదో అదే నా ధామము” అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో రహస్యాన్ని విప్పి చెప్పాడు. అయితే అటువంటి భగవద్ధామము చింతామణులతో నిర్మితమై యుండిఅద్భుతమైన సౌధాలను కలిగి ఉంటుందని, అక్కడ కల్పవృక్షాలతో నిండిన వనాలు ఉంటాయని, అక్కడ శ్రీకృష్ణుడు లక్షలాది లక్ష్మీగణముచే సేవలను అందుకుంటూ ఉంటాడని బ్రహ్మసంహిత ”మన ఊరి” వివరాలను అందిస్తున్నది. ఎప్పుడైతే మనము మనసా, వాచా, కర్మణా భగవద్ధామమే ”మా ఊరు” అన్నట్లుగా వ్యవహరిస్తామో అప్పుడే భక్తిసాధన సఫలమౌతున్నట్లుగా గుర్తించవచ్చును. నిజంగా ఆ రోజు ఎప్పుడొస్తుందో కదా! హరేకృష్ణ!

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.