భక్తిరక్షకమైన శ్రీనృసింహదర్శనం

ఇతో నృసింహః పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహః |
బహిర్ నృసింహ హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే ||

Narasimhayadagiriguta”శ్రీనృసింహుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడను ఉన్నాడు, నేనెక్కడకు వెళితే అక్కడను నృసింహుడు ఉన్నాడు. ఆ నృసింహుడు హృదయం లోపల, బయట కూడ ఉన్నాడు. సమస్తానికీ ఆదియైనవాడు, పరమాశ్రయమైనవాడు అయినట్టి శ్రీనృసింహునికి నేను శరణుజొచ్చెదను.”
భక్తిలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు వైష్ణవులు శ్రీనృసింహుని కొలుస్తారు, భక్తితో సేవిస్తారు, ఆనందంతో కీర్తిస్తారు. శ్రీనృసింహుడు భక్తప్రహ్లాదుని రక్షించిన విధము అత్యద్భుతము. పైన తెలుపబడిన స్తోత్రంలో లాగా తెలుగువారి పుణ్యఫలంగా శ్రీనృసింహుడు మన రాష్ట్రంలో అడుగడుగునా వెలసి ఉన్నాడు. భక్తులకు కోరిన కోరికలు తీరుస్తున్నాడు. ఆ విధంగా వెలసిన శ్రీనృసింహతీర్థాలలోని కొన్ని ముఖ్యమైనవాటిని ఇక్కడ మీరు సంక్షిప్తంగా తెలిసికోవచ్చును.

సింహాచలం :
సింహాచల క్షేత్రం విశాఖపట్నంలో ఉన్నది. సింహాచలానికే సింహాద్రి అనే పేరు కూడ ఉంది. ఇక్కడ వెలసి ఉన్నవాడు వరాహ నృసింహుడు. ఏడాది పొడుగునా శ్రీనృసింహుడు ఇక్కడ చందనంతో కప్పబడి ఉండి కేవలము అక్షయతృతీయరోజు నిజరూప దర్శనం ఇస్తాడు. సింహాచల క్షేత్రం తిరుపతి తరువాత రాబడి కలిగిన తీర్థక్షేత్రంగా చెప్పబడుతుంది. భారతదేశంలో ఉన్నట్టి 18 పెద్ద నృసింహ క్షేత్రాలలో ఇది ఒకటి.
భక్తప్రహ్లాదుడు హిరణ్యకశిపుని తనయుడు. హరిభక్తిని మానమని హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి ఎంత చెప్పినా ఆ బాలభక్తుడు వినలేదు. తన మాట వినకపోయేసరికి ఆ అసురుడు తన పుత్రుని ఎంతో భయపెట్టాడు. చివరకు అతడిని చంపేయమని భటులకు ఆదేశించాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రహ్లాదుని కొండ మీద నుండి త్రోసివేసినపుడు శ్రీమన్నారాయణుడే అతనిని రక్షించాడు. ఆ సమయంలో భక్తరక్షణార్థము భగవంతుడు నిలబడిన చోటనే సింహాచల మందిరం ఉన్నది.
క్రీ.శ. 1267వ సంవత్సరంలో ఒరిస్సా రాజు నరసింహదేవుడు ప్రధాన గుడిని నిర్మించినట్లుగా శిలాశాసనాలు చెబుతున్నాయి. క్రీ.శ.1516లో, క్రీ.శ. 1519లో శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సా రాజును ఓడించి తిరిగి వస్తూ ఈ క్షేత్రాన్ని దర్శించాడు. ఆ సమయంలో అతడు శ్రీనృసింహుని నిత్యసేవకై ఎన్నో గ్రామాలను, విలువైన ఆభరణాలను సమర్పించాడని తెలుస్తున్నది. కృష్ణదేవరాయలు సమర్పించిన పచ్చల కంఠాభరణం ఇప్పటికీ దేవస్థానంలో ఉంది.
దక్షిణభారతదేశ యాత్రకు బయలుదేరిన శ్రీచైతన్యమహాప్రభువు మన రాష్ట్రంలో మొదట శ్రీకూర్మంలో శ్రీకూర్మనాథుని దర్శించి ఆ తరువాత విశాఖపట్నానికి చేరి శ్రీనృసింహుని దర్శించుకున్నారని ”శ్రీచైతన్యచరితామృతం”లో వర్ణించబడింది. శ్రీనృసింహుని దర్శించగానే ఆయన పారవశ్యంతో పులకించి నృత్యకీర్తనలు చేసారు. శ్రీల ప్రభుపాదులవారి గురువుగారైన శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీ గోస్వామి వారు శ్రీచైతన్యమహాప్రభువు పాదముద్రలను ఈ సింహాచల క్షేత్రంలో ప్రతిష్ఠించారు.
గుడిలో ఉన్నట్టి కప్పస్తంభానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్తంభంలో ఎన్నో అద్భుతమైన మహిమలు ఉన్నాయి. ఆ స్తంభం క్రిందనే సంతాన గోపాలస్వామి యంత్రం ఉన్నది. ఎవరైతే ఈ స్తంభాన్ని భక్తిప్రపత్తులతో ఆలింగనము చేసికొంటారో వారికి సత్సంతానం కలుగుతుందని చెబుతారు. తమ కోరికలు తీర్చుకొనగోరేవారు ఈ స్తంభానికి ”కప్పము” (కానుకలు) చెల్లిస్తారు కాబట్టి ఇది కప్పస్తంభంగా ప్రసిద్ధి చెందింది.
సాధారణంగా ఉండే ఆలయాలకు భిన్నంగా సింహాచల క్షేత్రంలో గుడి పడమటి వైపు ముఖంగా ఉంటుంది. ఇది విజయానికి సూచకమని అంటారు.

మంగళగిరి :
మంగళగిరి క్షేత్రం గుంటూరు జిల్లాలో ఉంది. ఇది విజయవాడ నగరానికి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంగళగిరి కూడ కొండ మీద ఉన్నట్టి తీర్థస్థానమే. మంగళగిరి అంటే సకల శుభదాయకమైన పర్వతమని అర్థం.
కొండ పైన వెలసిన భగవంతుడు శ్రీపానకాల నరసింహస్వామి. ఇక్కడ స్వామికి భక్తులు బెల్లం పానకం, చక్కెర పానకం సమర్పిస్తారు. ఎవరి తాహతుకు తగ్గట్టు వారు సమర్పించినా, అందులో కొంత భాగాన్ని స్వామి వెనకకు ప్రసాదరూపంలో ఇచ్చివేయడం ఇక్కడ ప్రధానమైన విషయం. కొండ మీద బిలంరూపంలో ఉన్న స్వామి నోట్లో పానకం పోయడం జరుగుతుంది. వందలు, వేలాదిగా భక్తులు ఇక్కడ నృసింహునికి పానకం సమర్పించినా గుడిలో ఒక్క చీమైనా మనకు కనిపించదు. కొండ క్రింద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉన్నది. అద్భుతమైన ఈ శ్రీవిగ్రహాన్ని పాండవజ్యేష్ఠుడైన ధర్మరాజు ప్రతిష్ఠాపన చేసాడని చెబుతారు. గుడి గాలిగోపురం పదకొండు అంతస్తులలో ఎంతో ఎత్తుగా ఉండి రమ్యంగా కనిపిస్తుంది.
ఈ తీర్థక్షేత్రాన్ని శ్రీశంకరాచార్యులు, శ్రీపాద రామానుజాచార్యులు, శ్రీల మధ్వాచార్యులు దర్శించి స్వామిని అర్చించారు. శ్రీవల్లభాచార్యులు ఇక్కడ కొంతకాలం వసించి ప్రచారం కూడ చేసారు. శ్రీచైతన్యమహాప్రభువు కూడ తమ దక్షిణదేశయాత్రలో భాగంగా ఇక్కడ శ్రీలక్ష్మీనృసింహదేవుని దర్శించారు. ఆయన ఈ తీర్థాన్ని దర్శించిన గుర్తుగా మెట్లదారిలో శ్రీచైతన్యుల పాదముద్రలు శ్రీల ప్రభుపాదులవారి గురువుగారైన శ్రీల భక్తిసిద్ధాంతసరస్వతీగోస్వామి వారిచే ప్రతిష్ఠించబడినాయి. అక్కడ నిత్యపూజలు జరుగుతాయి.
ఫాల్గుణశుద్ధ చతుర్దశిరోజు స్వామివారి కల్యాణోత్సవం జరుగుతుంది. ఆ రోజుకు ముందు చెంచులు తమ కుమార్తెయైన చెంచులక్ష్మి స్వామిని వివాహం చేసికొన్న ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కల్యాణం జరిగిన మర్నాడు పౌర్ణమినాడు రథోత్సవం జరుగుతుంది.
నముచి అనే రాక్షసుని సంహారంలో శ్రీనృసింహుడు సుదర్శనచక్ర స్థితుడై తత్కార్యం చేసాడని, ఆ కార్యం తరువాత స్వామిని శాంతింపజేయడానికి దేవతలు అమృతం ఇచ్చారని స్థలపురాణం చెబుతున్నది. అది కృతయుగంలోని మాట. తరువాత భక్తులు త్రేతాయుగంలో నెయ్యిని సమర్పించారు, ద్వాపరయుగంలో క్షీరాన్ని సమర్పించారు, అయితే కలియుగంలో బెల్లం పానకం సమర్పించబడుతోంది. అందుకే నృసింహునికి ఇక్కడ పానకాల లక్ష్మీనృసింహుడని పేరు వచ్చింది.

అహోబిలం :
అహోబిల క్షేత్రం కర్నూలు జిల్లా నంద్యాల దగ్గరలో ఉన్నది. అహోబిలం అనే పేరులో ”అహో” అనేది ఆశ్చర్యార్థకము. ఆశ్చర్యకరమైన బిలం రూపంలో శ్రీనృసింహుని మందిరం ఉన్నది కాబట్టే ఇది అహోబిలమైంది. ఇక్కడ నృసింహదేవుని దర్శనం తొమ్మిది రూపాలలో జరుగుతుంది. ఈ నవనృసింహుల ఆలయాలు నల్లమల అడవీప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. గరుడుడు తన స్వామిని నృసింహరూపంలో దర్శించడానికి తపస్సు చేసినపుడు తన భక్తుని కోరికను తీర్చడానికై భగవంతుడు తొమ్మిది రూపాలలో ప్రత్యక్షమయ్యాడని స్థలపురాణం చెబుతున్నది.
అహోబిల క్షేత్రంలో శ్రీనృసింహుడు వరసిద్ధి నరసింహునిగా ప్రసిద్ధి చెందాడు. నృసింహుడు హిరణ్యకశిపుని వధించిన తరువాత చెంచులక్ష్మిని చూసింది కూడ ఈ ప్రాంతంలోనేనని చెబుతారు. ఇక్కడ కూడ చెంచులు స్వామివారి కల్యాణాన్ని చేస్తారు.
నవనరసింహక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అహోబిల క్షేత్రంలో క్రింద నున్న గుడి ప్రహ్లాదవరద నృసింహునిది.

యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్ట నల్గొండజిల్లాలో ఉన్నది. ఇది హైదరాబాదు నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏడాది పొడుగునా శ్రీనృసింహునికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరము మార్చిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
త్రేతాయుగంలో ఋష్యశృంగుని తనయుడైన యాదఋషి ఇక్కడ ఆంజనేయస్వామి ఆశీర్వాదంతో కొండగుహలో తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన నృసింహదేవుడు ఐదురూపాలలో ప్రత్యక్షమయ్యాడు. జ్వాలా నృసింహుడు, యోగానంద నృసింహుడు, గండభేరుండ నృసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీనరసింహుడు అనేవే ఆ ఐదురూపాలు. ఆ విధంగా యాదఋషి పేరు మీదనే ఈ క్షేత్రం యాదగిరిగుట్టగా పేరు పొందింది. అంతే కాకుండ దీనిని పంచ నరసింహక్షేత్రమని కూడ అంటారు. స్కందపురాణంలో ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన ఉన్నది.
ఇక్కడ ఋషులు శ్రీనృసింహుని ఆరాధించిన స్థలం కాబట్టి ”ఋషి ఆరాధన క్షేత్రము” అని కూడ ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా శ్రీనృసింహుడు ఇక్కడ వైద్యనృసింహునిగా పేరు పొందాడు. ఎందరో భక్తులు యాదగిరి గుట్టలో నృసింహుని దర్శనం ద్వారా రోగవిముక్తులయ్యారు. అంతే కాకుండ ఇక్కడ శ్రీనృసింహుడు దుష్టగ్రహ నివారకుడైన సకలశుభదాయకునిగా భక్తులకు ఇష్టదైవముగా అయ్యాడు. స్వయంగా శ్రీనృసింహుడే భక్తులకు కలలో కనిపించి వైద్యం చేసిన వృత్తాంతాలు, ఔషధము ఇచ్చిన సంఘటనలు భక్తులు ఎంతో విశ్వాసంగా చెప్పుకుంటారు. వైశాఖ శుద్ధ ద్వాదశి నుండి చతుర్దశి వరకు శ్రీనృసింహజయంతి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.

ధర్మపురి :
ధర్మపురి క్షేత్రం కరీంనగర్ జిల్లా జగిత్యాలకు దగ్గరలో ఉన్నది. అద్భుతమైన ధర్మపురి క్షేత్రం గోదావరి ఒడ్డున వెలసి ఉన్నది. ఇక్కడ పాత నరసింహస్వామి ఆలయం, క్రొత్త నరసింహస్వామి ఆలయం అనేవి రెండు ఉంటాయి. గోదావరి తీరంలో కూడ బ్రహ్మగుండం, యమగుండము, సత్యవతి గుండం వంటి అనేక స్నానఘట్టాలు ఉన్నాయి.
ధర్మవర్మ అనే రాజు బ్రహ్మవిష్ణువుల గురించి తపస్సు చేయగా శ్రీనారసింహుని సౌమ్యరూప దర్శనం జరిగిందని స్థలపురాణం చెబుతున్నది. తరువాత బ్రహ్మదేవుని ఆశీర్వాదం మేరకు ఈ స్థలం ఆ రాజు పేరు మీద ధర్మపురిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆలయంలో యోగనరహింహునితో పాటు బ్రహ్మదేవుని మూర్తి కూడ ఉండడం విశేషం. బలరాముడు, మురళీకృష్ణుని శ్రీమూర్తులు ఇక్కడ దర్శనమివ్వడం ఇంకొక విశేషం. ఫాల్గుణమాసంలో స్వామివారికి ఇక్కడ కల్యాణోత్సవం జరుగుతుంది.
యోగనరసింహుని ఆలయంలో రామలింగేశ్వరస్వామి గుడి కూడ ఉన్నది. లంకలో రావణుని జయించిన తరువాత శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వెళుతూ ఇక్కడ ఆగి శివుణ్ణి ఆరాధించడము వలన రామలింగేశ్వరస్వామి (రామేశ్వరంలో లాగా) అనే పేరు ప్రసిద్ధి చెందింది.

అంతర్వేది :
అంతర్వేది నృసింహక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా నర్సాపురానికి దగ్గరలో ఉన్నది. గోదావరి ఒక పాయయైన వశిష్ఠనది ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. హిరణ్యకశిపుని తనయుడైన రక్తవిలోచనుని సంహరించడానికి శ్రీనృసింహుడు అవతరించి తన మాయాప్రయోగంతో ఆ రాక్షసుని రక్తం నేలపై పడకుండా చేస్తూ వాడి తలను ఛేదించిన క్షేత్రమే అంతర్వేది. వశిష్ఠుని ప్రీత్యర్థము ఈ రాక్షస సంహారాన్ని నృసింహదేవుడు చేసాడు. తరువాత వశిష్ఠుడు నృసింహుని అక్కడే ఉండిపొమ్మని అర్థించగా ఆ స్వామి దానికి అంగీకరించాడు. ఆ విధంగా వశిష్ఠుడు సకల దేవతల సన్నిధిలో శ్రీలక్ష్మీనృసింహుని ప్రతిష్ఠించాడు. రక్తవిలోచనుని రక్తం నేలమీద పడకుండ ఆపిన మాయాశక్తి ఆ రక్తాన్ని తరువాత వదలినందువలననే అక్కడ నదికి రక్తకుల్య అనే పేరు వచ్చింది.
ఇక్కడ శ్రీనృసింహదేవునికి మాఘశుద్ధ సప్తమి నుండి కల్యాణోత్సవము జరుగుతుంది. అసలు కల్యాణం దశమిరోజు, రథయాత్ర శుద్ధ ఏకాదశి రోజు జరుగుతాయి. ఇక నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు జరుగుతుంది.
అంతర్వేదిలో సాగరము, సాగరసంగమ స్థానము, వశిష్ఠనది, రక్తకుల్యనది, చక్రతీర్థమనే ఐదు స్థానాలు అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడతాయి. ఎవరైతే ఈ తీర్థాలలో స్నానం చేసి దక్షిణలు సమర్పిస్తారో వారికి తప్పకుండా మోక్షం లభిస్తుందని చెప్పబడుతుంది. ఈ తీర్థంలో చేయబడే పిండోదక క్రియలు గయ, గంగాతీరంలో చేసే పిండోదక క్రియలతో సమానమైన ఫలితం ఇస్తుంది. ఈ స్థానం ముక్తినొసగే ప్రదేశం కాబట్టి ముక్తిక్షేత్రమని, శ్రీనృసింహదేవుని తీర్థము కనుక ”నృసింహక్షేత్రము” అని పిలువబడుతోంది.

సింగరాయకొండ :
సింగరాయకొండ ప్రకాశం జిల్లాలోని ఒంగోలు దగ్గరలో ఉన్నది. ఇక్కడ పదిహేనవ శతాబ్దపు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒక కొండ పైన ఉన్నది. కొండ క్రింద ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, పెద్ద చెఱువు ఉన్నాయి.
భక్తప్రహ్లాదుడు శ్రీనృసింహుని స్తుతిస్తూ ”దేవదేవా! మహానుభావా! ప్రియములు, అప్రియములు అయిన పరిస్థితుల సంయోగము చేత, వాటి వియోగము చేత జీవుడు శోకాగ్నితో తప్తమై స్వర్గనరకాది లోకాలలో ఉంచబడుతున్నాడు. అటువంటి దుఃఖమయ జీవితము నుండి బయటపడడానికి పలు ఉపాయములు ఉన్నప్పటికిని అవి అసలైన దుఃఖము కన్నను అమిత దుఃఖకరములై ఉన్నాయి. కనుక నీ సేవలో నెలకొనడమే నిజమైన ఉపాయమని నేను తలుస్తున్నాను. దయచేసి నాకు అటువంటి నీ సేవను ప్రసాదించు” అని కీర్తించాడు.
మన రాష్టంలో శ్రీలక్ష్మీనృసింహుడు మనకు సేవాభాగ్యాన్ని కలిగించడానికి అడుగడుగునా వెలసి ఉన్నాడు. కాబట్టి జీవితాన్ని భగవద్ధామ పథంలో నడిపేవారు, ఆస్తికులు, ధర్మపరులు అందరూ కూడ శ్రీనృసింహుని అనవరతము కొలుస్తూ సుఖశాంతులతో జీవించెదరు గాక! సమస్తమగు దుఃఖాల నుండి బయటపడెదరు గాక! శ్రీలక్ష్మీనృసింహదేవునికి జయము జయము!!! హరేకృష్ణ!

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.