ప్రధానమైన సేవ

essential_service(భగవద్దర్శన్ ప్రతికను ముద్రించడంలోనిప్రాముఖ్యాన్ని శ్రీల ప్రభుపాదులవారు నవంబర్ 5, 1956 సంచికలో వర్ణించారు. దానిలోని కొంత భాగము ఈ విధంగా ఉన్నది.)
నవీన నాయకులకు, ధార్మికులకు, తత్త్వవేత్తలకు, జనసామాన్యానికి వివేక విశిష్టమైన ఆస్తికవాదాన్ని గురించి బోధించడానికే భగవద్దర్శన్ పత్రిక పక్షానికి ఒకసారి ముద్రించబడుతున్నది. ఇదేదో గ్రుడ్డి మతమౌఢ్యం గాని, నడిమంత్రపుసిరి వ్యక్తి యొక్క తిరుగుబాటు ధోరణి గాని కాకుండ దేవదేవుడు లేదా పురుషోత్తముని సంబంధములో మన నిత్యావసర విషయానికి సంబంధించిన శాస్త్రీయమైన దృక్పథం అని తెలిసికోవాలి. ఆ దేవదేవునితో మన నిత్యసంబంధము గురించి, ఆతని పట్ల మన బాధ్యతా నిర్వహణ చేసే పద్ధతి గురించి, తద్ద్వారా ప్రస్తుత మానవజన్మలో పొందగలిగే పరమోన్నతసిద్ధి గురించి ఈ పత్రిక చెబుతుంది.

ఆధ్యాత్మికంగా పురోగమించిన బ్రాహ్మణుల ఇండ్లలో పిల్లలకు ఆధ్యాత్మిక ప్రగతికి చక్కని అవకాశం లభిస్తుంది. పూర్వజన్మలో ఆధ్యాత్మిక సాధనను ఎక్కడ వదలిపెట్టారో అక్కడ నుండి దానిని కొనసాగించడానికి అది అవకాశాన్ని ఇస్తుంది. అటువంటి మంచి వంశంలోని వాతావరణం చక్కని సంస్కృతికి అనుకూలమౌతుంది. ఆ విధంగా ఉత్తమస్థితిని పొందినవారికి భగవద్గీత వారి గతకర్మలను గుర్తు చేస్తున్నది. కాని దురదృష్టవశాత్తు భగవద్గీతను అధ్యయనం చేయని కారణంగా బ్రాహ్మణవంశంలోని పిల్లలు కూడ మాయచే తప్పుదారి పడుతున్నారు. ఇక సంపన్నులైన వైశ్యుల ఇంటిలో జన్మము జీవితారంభము నుండి, తరువాత కూడ జీవిక సమస్య లేకుండ చేసి సుఖమయ జీవితాన్ని కలుగజేస్తుంది. ఇట్టి సుఖమయజీవన పరిస్థితి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడానికి నిశ్చయంగా ఒక అవకాశం వంటిది. కాని దురదృష్టవశాత్తు ప్రస్తుత ఇనుపయుగం (యంత్రాలు, యాంత్రిక సంఘము) ప్రభావం వలన ధనిక సంతానము ఆధ్యాత్మికప్రగతి అవకాశాన్ని మరచి ఇంద్రియభోగంలో దారితప్పుతారు. అందుకే రావణుని స్వర్ణమయ లంక భగవద్రహితమైన కారణంగా కాలి బూడిద అయినట్లు, ప్రకృతి నియమాలు వారి స్వర్ణభవంతులలో అగ్గిపెట్టుతున్నాయి. ప్రకృతి నియమమంటేనే ఇది.

అందువలన “భగవద్దర్శన్”లో దీనిని జ్ఞాపకము చేయడం బ్రాహ్మణ వైశ్యవర్ణాల వారికి ప్రధానమైన సేవనే అవుతుంది. వారు ఈ విషయాన్ని జాగ్రత్తగా చదివి, అది కొనసాగేటట్లు చూసుకోవాలి. అదే వివేక విశిష్టమైన ఆస్తికవాదం అనబడుతుంది.

భగవద్గీత అనేది ఆధ్యాత్మికశాస్త్రము యొక్క ప్రాథమిక అధ్యయనము. ఆర్థికాభివృద్ధి కార్యక్రమమే గాని, సంక్షేమ కార్యమే గాని భగవద్గీత ననుసరించి ఏర్పాటు చేయడం బాధ్యతాయుతులైన సంఘపెద్దల బాధ్యత. అస్థిరమైన స్థితిలో జీవితము యొక్క ఆర్థికసమస్యను పరిష్కరించడానికి గాక సమస్యాపూర్ణమైన జీవితానికి, అంటే ప్రకృతి పరిస్థితులచే ప్రస్తుతము మనం ఉంచబడిన స్థితికి చరమ పరిష్కారాన్ని ఇవ్వడానికే మనం ఉన్నాము. ఇది మన కర్తవ్యము. ఈ కర్తవ్య నిర్వహణలో సావధానులుగా ఉండాలని “భగవద్దర్శన్” అందరికీ గుర్తు చేస్తున్నది.

“భగవద్దర్శన్” పత్రిక భావాతీత చైతన్యస్థితికి సమస్త మానవాళిని చేర్చడానికి యత్నిస్తుంది కాబట్టి ఇది “ప్రధానమైన సేవ” అని చెప్పబడుతుంది. అటువంటి జీవనస్థితిని పొందడానికి ఇంద్రియభోగభావనకు దూరముగా ఉండడమే ఏకైక యోగ్యత.

“భగవద్దర్శన్” పత్రికను క్రమము తప్పకుండా చదువుతూ దీనిలో చెప్పబడిన సిద్ధాంతాలను ఆకళింపు చేసికోవడానికి యత్నించడము కూడా ప్రకృతి త్రిగుణాలకు అతీతము కావడమే అవుతుంది. కాబట్టి ఇది ప్రధానమైన సేవయే అనబడుతుంది.

భగవద్గీతలోని పండ్రెండవ అధ్యాయంలో చెప్పబడిన ఉపదేశం నుండి ప్రతియొక్కరు పూర్ణలాభాన్ని పొందాలి. ముక్తికి సరళమైన, సులభమైన మార్గము దానిలో చెప్పబడింది. ప్రతియొక్కరు తమ లాభం కొరకు ఆ నియమాన్ని చేపట్టాలి. అటువంటి వాంఛితస్థితిని చేరడానికి “భగవద్దర్శన్” పత్రిక పాఠకులందరికీ సహాయపడుతుంది.
(కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు నవంబరు 5, 1956 భగవద్దర్శన్ సంచికలో రచించిన వ్యాసానికి తెలుగులో భావానువాదం)