రామభక్తుల రామపరాయణత్వము

Ram navami 1హనుమదాది రామభక్తులు రామనామ మహిమను చక్కగా లోకంలో చాటారు. ఆంజనేయుడు సీతాన్వేషణ కార్యంలో లంకకు చేరవలసివచ్చినపుడు రామనామంతోనే సముద్రాన్ని లంఘించాడు. ఇక శ్రీరాముడు వానరసేనతో లంకపై దాడి చేయడానికి వెడలినపుడు సముద్రంపై వారధి కట్టవలసివచ్చింది. అపుడు రాళ్ళపై రామనామాన్ని వ్రాసి అవి నీటిపై తేలేటట్లు చేయడం జరిగింది. ఆ విధంగా కొండశిలలు కూడ రామనామంతో తేలికపడి నీటిపై తేలాయి. సేతుబంధనంలో తమ వంతు కార్యాన్ని నిర్వహించాయి. ఆ కాలంలోనే కాకుండ ప్రస్తుత కాలంలోను తులసీదాసు, భద్రాచల రామదాసు, త్యాగయ్య వంటి ఎందరో రామభక్తులు తమ భక్తితత్పరతతో తరించారు. శ్రీచైతన్యమహాప్రభువు దక్షిణభారతదేశంలో ఉన్నప్పుడు అటువంటి ఒక రామభక్తుని కలిసికోవడం జరిగింది.
దక్షిణభారతంలో పర్యటిస్తున్న మహాప్రభువు మధురైకి చేరుకున్నారు. అది శివక్షేత్రం. అక్కడ మీనాక్షీదేవి ఆలయం ఉన్నది. బహుపురాతన కాలంలో శ్రీకులశేఖరుడు ఈ ప్రాంతాన్ని పాలించాడు. తన పాలనలోనే అతడు బ్రాహ్మణుల ఆవాసానికి ఏర్పాటు చేసాడు. ఆ ప్రదేశంలో నివసించే ఒక బ్రాహ్మణుడు గొప్ప రామభక్తుడు. అతడు శ్రీచైతన్యులను తన ఇంటికి ఆతిథ్యానికి పిలిచాడు. కృతమాలా నదిలో స్నానం చేసి వచ్చిన మహాప్రభువు మధ్యాహ్న భోజనానికై ఎదురు చూసారు. అయితే బ్రాహ్మణుడు ఇంకా వంట చేయనట్లుగా తెలిసింది. మధ్యాహ్నవేళ##యైనాఇంకా వంట చేయకపోవడానికి కారణమేమిటని శ్రీచైతన్యులు బ్రాహ్మణుని అడిగారు.
”స్వామీ! మేము అడవి ప్రాంతంలో ఉన్నాము. అన్నీ మాకు అందుబాటులో ఉండవు. లక్ష్మణుడు అడవి నుండి కందమూల ఫలాదులను, వంట చెరకును అన్నీ తెస్తే మా సీతమ్మ వంట మొదలుపెడుతుంది” అని బ్రాహ్మణుడు సమాధానం చెప్పాడు.
బ్రాహ్మణుని భక్తిభావానికి మహాప్రభువు సంతుష్టులయ్యారు. చివరకు బ్రాహ్మణుడు వంట పూర్తి చేసి మూడు గంటల వేళకు భోజనం ఏర్పాటు చేసాడు. కాని తాను మాత్రం భోజనం చేయలేదు. అది చూసిన మహాప్రభువు దానికి కారణం అడిగారు. బ్రాహ్మణుడు ఎందుకు అంతగా దుఃఖితుడై యున్నాడని ప్రశ్నించారు.
”స్వామీ! ఏమని చెప్పేది? నిజంగా నేను బ్రతికి ఉండడానికి ఏ కారణం కనిపించడము లేదు. అగ్నిలో గాని, నీటిలో గాని దూకి ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నాను. జగన్మాత సీతను రావణుడు చెరపట్టాడు. ఆమెను ఆ ధూర్తుడు తాకాడనే వార్తను నేను భరించలేకపోతున్నాను. స్వామీ! ఈ దుఃఖంతో నేనెంతో కాలం బ్రతకలేను. ఈ విధంగా నా దేహం దహించుకొనిపోతున్నా కూడ నా ప్రాణం పోవట్లేదు” అని బ్రాహ్మణుడు తన మనస్సులోని మాట చెప్పాడు.
”ఓ బ్రాహ్మణుడా! ఇంకెప్పుడూ ఇలా ఆలోచించకు. నీవు పండితుడవు. శ్రీరామచంద్రుని పత్నియైన సీతాదేవిని ఎవ్వడూ భౌతికనేత్రాలతో చూడలేడు. లౌకికునికి అంతటి శక్తి ఉండనే ఉండదు. ఆమె పూర్ణానందరూపాన్ని కలిగి ఉన్నది. ఆమెను తాకడం మాట అటుంచి లౌకికుడు ఆమెను చూడనైనా చూడలేడు. రావణుడు అపహరించినది మాయాసీతనే. నిజానికి రావణుడు రాగానే సీతాదేవి అదృశ్యమై మాయాసీతను వాడి ముందు నిలిపింది. ఆధ్యాత్మిక వస్తువు భౌతికభావన పరిధిలోనికి రాదు. ఇది వేదపురాణ నిర్ణయం. నా మాట మీద నమ్మకముంచు. అనవసరంగా నీ మనస్సును బరువు చేసికోకు” అని శ్రీచైతన్యులు అతనికి నచ్చజెప్పారు.
శ్రీచైతన్యుల మాట మీద విశ్వాసంతో బ్రాహ్మణుడు అపుడు భోజనం చేసాడు. తరువాత శ్రీచైతన్యులు అక్కడ నుండి బయలుదేరి దుర్వసనమనే ప్రదేశానికి వచ్చారు అక్కడ ఒక రామాలయం ఉన్నది. అక్కడే ఉన్న మహేంద్రాది శైలము పైన ఆయన పరశురాముణ్ణి దర్శించారు. తరువాత ఆయన రామేశ్వరానికి వెళ్ళి దర్శనం చేసికొన్నారు. అక్కడ బ్రాహ్మణులు కూర్మపురాణం చదువుతుంటే వారి నుండి మహాప్రభువు సీతాదేవి కథను విన్నారు. పతివ్రతా శిరోమణి, జగన్మాత, జనకనందిని యైన సీతాదేవి రావణుడు రాగానే అగ్నిదేవుని ఆశ్రయించింది. అగ్నిదేవుడు ఆమె దేహాన్ని అగ్నితో కప్పడం వలన రావణుని బారిన పడకుండ రక్షింపబడింది. తరువాత రావణుడు మాయాసీతను అపహరించాడు. అగ్నిదేవుడు అసలు సీతాదేవిని దుర్గాదేవి చెంతకు చేర్చగా, మాయాసీత రావణుని ముందుకు వచ్చింది. ఆ విధంగా రావణుడు వంచింపబడ్డాడు. రావణుని వధ తరువాత సీతాదేవికి అగ్నిపరీక్ష సమయంలో అగ్నిదేవుడు మాయాసీతను అదృశ్యం చేసి అసలు సీతను రామచంద్రునికి అందజేసాడు. ఈ కథనాన్ని వినిన శ్రీచైతన్యులు పూర్తి సంతుష్టి చెందారు. అపుడు ఆయన మదిలో రామభక్తుడైన బ్రాహ్మణుడే కదిలాడు. బ్రాహ్మణసంఘములో కూర్మపురాణం ద్వారా ఈ కథనాన్ని వినిన శ్రీచైతన్యులు వారి అనుమతితో కూర్మపురాణ ప్రతిలోని సంబంధిత తాటాకులను తన వెంటను తీసికొన్నారు. ఆ కూర్మపురాణప్రతిలోని తాటాకులు ఎంతో పాతవి. అయినా ప్రత్యక్షనిదర్శనం కొరకు మహాప్రభువు వాటిని తన వెంట తీసికొని మథురైలోని బ్రాహ్మణుని ఇంటికి మళ్ళీ వచ్చారు. వస్తూనే తాను తెచ్చిన నిదర్శనాన్ని బ్రాహ్మణుని చేతిలో పెట్టారు.
”సీతాదేవి అభ్యర్థన మేరకు అగ్నిదేవుడు మాయాసీతను రావణుని ముందుకు తీసికొనివచ్చాడు. దశకంఠుడు అపుడు ఆ మాయాసీతనే అపహరించాడు. అపుడు అసలు సీత అగ్నిదేవుని లోకానికి వెళ్ళింది. శ్రీరామచంద్రుడు సీతాదేవికి అగ్నిపరీక్ష పెట్టినపుడు మాయాసీత అగ్నిలో ప్రవేశించింది. ఆ సమయంలో అగ్నిదేవుడు తన లోకం నుండి అసలు సీతను తెచ్చి శ్రీరామచంద్రునికి సమర్పించాడు.”
కూర్మపురాణంలోని మూల తాటాకుల ప్రతిలో ఉన్నట్టి రెండు శ్లోకాలను చూడగానే బ్రాహ్మణుడు వెంటనే శ్రీచైతన్యుల పాదాలపై పడి గట్టిగా ఏడ్చాడు. ”స్వామీ! నీవు సాక్షాత్తుగా శ్రీరాముడవే. నాకు దర్శనమివ్వడానికి నీవు సన్న్యాసి రూపంలో వచ్చావు. నీవు నన్ను గొప్ప దుఃఖం నుండి బయటపడేసావు. ఈ రోజు మా ఇంట్లోనే మీరు భోజనం చేయండి. క్రిందటి సారి నా మనస్సు బాగాలేక పోవడం వలన మీకు సరిగ్గా ఆతిథ్యం ఇవ్వలేకపోయాను. అదృష్టం కొద్దీ మీరు మళ్ళీ నా ఇంటికి వచ్చారు. నేను మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని నాకు ఇవ్వండి” అని పదేపదే ప్రార్థించాడు. తరువాత అతడు రామనామగానంతో వంట చేసి సర్వోత్తమమైన పిండివంటలతో శ్రీచైతన్యులకు భోజనం పెట్టాడు. శ్రీచైతన్యులు కూడ ఎంతో ప్రీతితో అతని చేతివంటను తిని సంతుష్టులై, ఆ రాత్రి అక్కడే ఉండి మర్నాడు తన యాత్రను కొనసాగించారు.
అద్భుతమైన ఈ లీల శ్రీచైతన్యచరితామృతములోని మధ్యలీలలో వర్ణించబడింది. రామరాజ్యంలో మానసిక క్లేశాలు, దేహపరమైన క్లేశాలు, వ్యాధులు, ముసలితనము, నష్టము, దుఃఖశోకాలు, భయము, అలసట అనేవి లేకుండేవని భాగవతంలో చెప్పబడింది. ఆ సమయంలో అడగకపోతే మృత్యువు కూడ వచ్చేది కాదట. రాముని అధ్యక్షతలో పాలన అంత ప్రభావశీలంగా ఉండేది. సీతాదేవి కూడ వినయముతోను, నిష్ఠతోను, బిడియముతోను, పాతివ్రత్యముతోను, ప్రేమతో తన పతియైన శ్రీరాముని చిత్తాన్ని హరించింది. అందుకే అందరు శ్రీసీతారామ కల్యాణంతో తమ జీవితం కూడ కల్యాణమయంగా మారుతుందని ఆశిస్తారు. హరేకృష్ణ!
(మార్చి నెల 28వ తేదీ శ్రీరామనవమి మహోత్సవము. మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండాలి. ఆ సందర్భముగా ఇది ప్రత్యేక వ్యాసము)

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.